BusinessHome Page SliderLifestyleNationalNews Alert

ఆన్‌లైన్‌లో దుస్తులు కొంటున్నారా.?.గూగుల్‌ సర్ ప్రైజ్ గిఫ్ట్

ఆఫర్లు ఉన్నాయనో, మోడల్స్ బాగున్నాయనో, టైం లేకనో చాలా మంది ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం యువతరం ఎక్కువగా ఆన్ లైన్ లోనే దుస్తులు ఖరీదు చేస్తున్నారు. అవి మీరు ధరిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ట్రైల్‌ వేయడమో, కొనడమో చేయాలి. ఇకపై ఆ అవసరం లేదు. కేవలం ఒక ఫొటో తీసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం గూగుల్‌ ఓ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరే డోప్ల్‌ (Doppl). వర్చువల్‌గా మీరెలా ఉంటారో చూసుకొనేందుకు ఈ యాప్‌ అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. గూగుల్‌ డోప్ల్‌ యాప్‌లో ముందు మీ పూర్తి ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆపై మీరు కోరుకుంటున్న దుస్తులు తాలుకా ఫొటో లేదా స్క్రీన్‌షాట్ అప్‌లోడ్‌ చేస్తే చాలు.. ఏఐ సాయంతో మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో ప్రివ్యూ చూపిస్తుంది. అంతేకాదు దాన్నో షార్ట్‌ వీడియో గానూ రూపొందిస్తుంది. అంటే మీరు ట్రయల్‌ రూమ్‌లో చూసుకున్నట్లుగానే ముందూ వెనక కూడా చూసుకోవచ్చు. కావాలంటే ఈ ఫొటోలను, వీడియోలను మీరు సేవ్‌ చేసుకోవచ్చు. మీరు ఇతరులకు పంపించొచ్చు. గూగుల్‌ ల్యాబ్స్‌ తీసుకొచ్చిన ఈ యాప్‌ ప్రస్తుతానికి ప్రయోగ దశలో ఉంది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతానికి ఇది అమెరికా పౌరులకు మాత్రమే. భారత్‌లో యూజర్లు దీన్ని వినియోగించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇతర దేశాల్లో ఎప్పుడు తీసుకొచ్చేదీ గూగుల్‌ కూడా చెప్పలేదు. అంతేకాదు ప్రయోగ దశలో ఉన్న నేపథ్యంలో మీరు కేవలం షర్ట్‌/టీషర్ట్‌ అప్‌లోడ్‌ చేసినా దానికి సూట్‌ అయ్యే మిగిలిన దుస్తులు, షూలను కూడా దానంతట అదే ఎంచుకొని యూజర్లకు చూపిస్తుంది.