NationalNews Alert

IT, కంప్యూటర్ సైన్సు మాత్రమే మంచి కోర్సులా ?

ఇప్పుడు డిగ్రీ చదువుకునే ఏ విద్యార్థిని అడిగినా ఇంజనీరింగ్ చదువుతున్నాననే చెపుతున్నారు. కేవలం ఇంజనీరింగ్ మాత్రమే డిగ్రీగా మారిపోయింది. BA, B.COM., B.SC., వంటి కోర్సులకు ఏనాడో కాలం చెల్లిపోయింది. కాగా ఇప్పుడు ఇంజనీరింగ్‌లో కూడా సంప్రదాయ కోర్సులైన ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ లాంటి కోర్సులు కూడా ఎవరూ తీసుకోవడం లేదు. ఎవరిని అడిగినా ఐటీ, కంప్యూటర్ సైన్సు లేదా దాని అనుబంధ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిపై ఢిల్లీ ఐఐటీ మాజీ డైరక్టర్ వి. రాంగోపాల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ఐఐటీ పోర్టల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. దానిలో తాను సందర్శించిన ప్రతి విద్యా సంస్థదీ ఒకే కథ అనీ, కంప్యూటర్ సైన్సు మినహా మిగిలిన కోర్సుల్లో మూడోవంతు సీట్లు కూడా భర్తీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిపార్టుమెంట్లలో పనిచేసే బోధనా సిబ్బందిని ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో కళాశాలలు ఉన్నాయన్నారు.

ప్రతీ విద్యార్థీ ఐటీ లేదా సీఎస్‌ఈనే చదివితే అప్పుడు ప్రతి కంపెనీ ఈ-కామర్స్, ఐటీ ఆధారిత ఉత్పత్తులను మాత్రమే తయారుచేస్తే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయన్నారు. దేశానికి అవసరమైన వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, రవాణా, సెమీకండక్టర్లు, డ్రోన్ సాంకేతికత మొదలైన ఇతర రంగాలు ఎలా అభివృద్ధి చెందుతాయని… విభిన్న రంగాల్లో దేశం కోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిచేది ఎవరని ప్రశ్నించారు. విభిన్న రంగాల అవకాశాలను నేటి తరానికి అర్థమయ్యేలా ఏఐసీటీఈ, యూజీసీ లఘు చిత్రాలు నిర్మించి విడుదల చేయాలని ఆయన కోరారు.

విద్యార్థులను దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలకు తీసుకువెళ్లి అక్కడ ఆధునిక మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్‌లు ఎలా పని చేస్తున్నాయో తెలియజేయాలన్నారు రాంగోపాల్ రావు. పరిస్థితులను మార్చడానికి జాతీయస్థాయిలో చొరవ చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి సూచనలను అమలు చేస్తే నేటి మన విద్యా వ్యవస్థలో ప్రక్షాళన ఆరంభమవుతుందన్నారు. దేశంలో అన్ని రంగాలలో ముందుకు వెళ్లేలా ప్రభుత్వాలు చొరవ చూపి కళాశాలల్లో నాణ్యమైన విద్య లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.