సివిల్ సర్వెంట్లకు…సివిల్ వివాదాల్లో పనేందయ్యా?
ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడం ఆలస్యం…వెంటనే సివిల్ పంచాయితీల్లో వేలు పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోదామనుకుంటున్నారు కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు…ఇలాగైతే పదేళ్లు కూడా ఉద్యోగంలో ఉండలేరు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సర్వెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్ నుండే డ్రెస్ వేసుకొని సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు.ఐఏఎస్ అధికారులు ఏసీ రూం వదిలి ఫీల్డ్ మీదకు వెళ్లి పని చేయడానికి బద్దకిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి ఏసీ జబ్బు పట్టినట్లుందని ఎద్దేవా చేశారు.క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన అధికారులు ఇలా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం హర్షణీయం కాదన్నారు.ఒళ్లు వంచి పనిచేస్తేనే తెలంగాణ ప్రజలు గర్విస్తారన్నారు.కులగణన సర్వే నత్తనడకన సాగుతున్న తీరుపట్ల ఆయన పై విధంగా స్పందించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

