తిరుమలలో అర్చనా గౌతమ్ రచ్చ
బాలీవుడ్ నటి అర్చనా గౌతమ్ తిరుమలలో హల్‌చల్ చేశారు. టీటీడీ సిబ్బందితో నటి అర్చనా గౌతమ్ వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీటీడీ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని అర్చన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఈ రోజు పోస్టు చేశారు. తాను వీఐపీ దర్శనం కోసం రూ. 10,500/- పెట్టి టికెట్ తీసుకున్నాని, అయితే దర్శనానికి ఇంత మొత్తంలో వసూలు చేయడం దారుణమని ఆమె ఆరోపించారు.
ఈ విషయానికి సంబంధించి టీటీడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ సర్కార్‌కు విన్నవించారు. మరోవైపు ఈ విషయంపై టీటీడీ అధికారులు స్పందించారు. ఈ ఘటన సోమవారం జరగలేదని ,గురువారం జరిగిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. నటి అర్చనా గౌతమ్ శ్రీవారి దర్శనం కోసం ఎంపీ సిఫార్సు లేఖను బుధవారం తీసుకువచ్చారు. అయితే ఆ లేఖను మంగళవారమే ఇవ్వాల్సివుండగా, గురువారం తీసుకువచ్చి హడావిడి చేశారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈమె గ్రేట్ గ్రాండ్ మస్తీ, హాసీనా పార్కర్ ,బారాత్ కంపెనీ వంటి పలు బాలీవుడ్ చిత్రాలలో నటించారు. తెలుగులోనూ ఐపీఎల్ అనే మూవీ చేశారు. ఇంకా పలు ధారావాహికలు ,వీడియో సాంగ్స్‌లోనూ నటించి ప్రేక్షకులను మురిపించారు. ఈ ఏడాదిలో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేశారు.

