జీవో నెంబర్ 1ని కొట్టేసిన ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. సభలు, సమావేశాల నిర్వహణకు సంబంధించి జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టేసింది. జీవో ప్రాధమిక హక్కులకు విఘాతం కలిగిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. రోడ్‌షోలను కట్టడి చేసేలా జీవో ఉందని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో తెచ్చారని పిటిషనర్ల న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

పోలీస్ యాక్ట్ 30కి భిన్నంగా జీవో నెంబర్ 1 తెచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, సీపీఐ నేత రామకృష్ణతోపాటు మరికొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. రోడ్లు, ర్యాలీలు, సభలకు తప్పక అనుమతి తీసుకోవాలంటూ జీవో 1 జారీ అయింది. సదరు నాయకుడు పర్యటన వివరాలు చెబితే, పోలీసులు అనుమతిస్తారని జీవో 1లో ప్రభుత్వం పేర్కొంది.

ఈ జీవో నల్ల చట్టమని మొదట్నుంచి చెప్పామన్నారు హైకోర్టు లాయర్ ముప్పాళ్ల సుబ్బారావు. ప్రజల హక్కులను న్యాయస్థానాలు రక్షిస్తున్నాయని ఆయన చెప్పారు. నిరసనలు, ఊరేగింపులు, సభలకు రాజ్యాంగం అనుమతిచ్చిందని ముప్పాళ్ల తెలిపారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధి దాటి వెళ్లరాదని కోర్టు అనేకసార్లు చెప్పిందని ఆయన తెలిపారు.

