నెల్లూరులో ప్రాజెక్టులు ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ రోజు నెల్లూరులోని పెన్నా బ్యారేజి, ఆత్మకూరు నియోజకవర్గం సంగం వద్ద మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజిలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని, దివంగత మాజీమంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహాలను కూడా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మొదలైనవారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి జ్ఞాపకాలతో బాధలో ఉన్న ఆయన కుటుంబసభ్యులను జగన్ ఓదార్చారు.

జగన్ మాట్లాడుతూ ఇక నెల్లూరులో కరువు మండలాలు కనపడవని, ఎంతో కష్టాలు పడి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలియజేశారు. సంగం బ్యారేజికి ఈ మధ్యే గుండెపోటుతో మరణించిన మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టామని, ఆయన ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును తాను పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు.