ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు
గత రెండు రోజుల క్రితం ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. కాగా మరో 1000 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర రైలు ప్రమాదంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఈ నేపథ్యంలో ఇవాళ ఒడిశాలో మరో రైలు పట్టాల తప్పింది. కాగా ఒడిశాలోని బారాగఢ్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ గూడ్స్ రైలు సున్నపురాయిని తీసుకువెళ్తుండగా రైలులోని 5 భోగీలు మెంధపలి సమీపంలో పట్టాలు తప్పాయి. అయితే ఆ సమయంలో అటుగా ఇతర రైళ్లు రాలేదు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే శుక్రవారం జరిగిన రైలు ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ రైల్వే అధికారులు ఖచ్చితంగా వెల్లడించలేదు. కాగా రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆశ్రయించారు. దీంతో ఈ ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

