Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

వివేకా హత్య కేసులో మరో కీలక మలుపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో మరో కీలక అప్లికేషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని కోరుతూ, హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల ఇచ్చిన పాక్షిక విచారణ ఉత్తర్వులను ఆమె ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. వివేకా హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను, పెద్దల పాత్రను బయటపెట్టాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని ఆమె కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20 వ తారీఖు వాయిదా వేసింది.
గతంలో జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం దర్యాప్తు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించిన నేపథ్యంలో, సీబీఐ కోర్టు కేవలం పరిమిత అంశాలకే అనుమతినిచ్చింది. అయితే, విచారణను కేవలం ఇద్దరి పాత్రకే పరిమితం చేయడం వల్ల కేసులోని లోతైన కుట్ర కోణం వెలుగులోకి రాదని సునీతారెడ్డి తన అప్లికేషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ సమర్పించిన నివేదికల్లోని ఇతర కీలక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని ఆమె కోరారు.
నిందితుల బెయిల్ రద్దు మరియు సాక్షుల భద్రత వంటి ముఖ్యమైన అంశాలు కూడా ఈ విచారణతో ముడిపడి ఉన్నాయని సునీతారెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా అసంపూర్తిగా ఉందని, అనేక కోణాల్లో నిజాలు వెలుగులోకి రావాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే రాజకీయంగా పెను దుమారం రేపుతున్న ఈ కేసులో, సీబీఐ దర్యాప్తు పరిధిపై వచ్చే వారం సుప్రీంకోర్టు ఇచ్చే స్పష్టత అత్యంత కీలకం కానుంది. వచ్చే మంగళవారం జరిగే విచారణపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.