InternationalNews Alert

మరో అమెరికా దిగ్గజ వ్యాపారసంస్థకు CEO గా భారతీయుడు

పొద్దున్న లేస్తూనే సువాసనలు వెదజల్లుతూ, నురగలు కక్కే కాఫీ కళ్లముందు ప్రత్యక్షమైతే ఆ కిక్కే వేరు. భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికులు చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక కాఫీ షాపులు ఉన్న అమెరికా దిగ్గజ సంస్థ STARBUCKS.  ఈ స్టార్‌బక్స్ అవుట్‌లెట్స్ చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ కాఫీ తాగాలని కాఫీ ప్రియులు ఉత్సాహపడుతూ ఉంటారు. ఇలాంటి స్టార్‌బక్స్ సంస్థ CEOగా భారత్‌కు చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. ఈయన ఇప్పటిదాకా రెకిట్ సంస్థకు సీఇవోగా  పని చేశారు. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ఆయన వయస్సు 55 సంవత్సరాలు. హోవార్డ్ షుల్ట్జ్ స్థానంలో లక్ష్మణ్ ఈ పదవి చేపట్టబోతున్నారు.

లక్ష్మణ్ తమ సంస్థ సీఈవో పదవినుండి వైదొలుగుతున్నట్లు రెకిట్ నిన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ షేర్లు 4 శాతం పడిపోయాయి.

లక్ష్మణ్ పూణె విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ చేసి, పెన్సిల్వేనియా యూనియర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. వార్టన్ స్కూల్ నుండి MBA కూడా చేశారు. 2019లో సెప్టెంబర్‌లో రెకిట్ కంపెనీ సీఈవోగా చేరారు. కరోనా మహమ్మారి సమయంలో కంపెనీకి మార్గనిర్దేశం చేయడంతో ఆ కంపెనీ యొక్క ఆరోగ్యం, పరిశుభ్రత ఉత్పత్తుల అమ్మకాలు బాగా పెరిగాయి.

రాబోయే అక్టోబర్ 1న స్టార్‌బక్స్‌లో చేరబోతున్నారు. అయితే 2023 ఏప్రిల్‌లో సీఈవోగా అధికారం చేపట్టబోతున్నారని స్టార్‌బక్స్ తెలిపింది. అప్పటివరకూ ప్రస్తుత సీఈవో హోవార్ట్‌తో కలిసి లక్ష్మణ్ పనిచేస్తారని పేర్కొంది. హోవార్ట్ ఉద్యోగులకు రాసిన లేఖలో లక్ష్మణ్ గురించి ప్రస్తావిస్తూ “ వినియోగదారుల కోసం శక్తిమంతమైన బ్రాండ్లను నిర్మించడంలో లోతైన అనుభవం ఉన్న నాయకుడు”  అని పేర్కొన్నారు.