బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి జయంతి
తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటి తరం నటీమణి భానుమతి. భానుమతి పేరు వింటేనే అప్పట్లో నటులందరికీ హడల్. అప్పటి నటులు ఆమెతో నటించడానికి జంకేవారు. కానీ, నిజానికి భానుమతి గంభీరంగా కనిపించినా సున్నిత మనస్కురాలు. ఆమె ప్రతిభ గురించి చెప్పాలంటే ఒక రంగంలో కాదు. అనేక రంగాలలో ఆమె విదుషీమణి. ఆమె తమ చిత్రంలో నటిస్తే చాలు అనుకునేవారు కొందరు దర్శకులు. పనికట్టుకొని మరీ ఆమె గురించి కొన్ని పాత్రలు సృష్టించేవారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, గాయనిగా ఎంతో ఎత్తుకు ఎదిగారు ఆమె. బహుశా ఇన్ని రంగాలలో పేరుతెచ్చుకున్న నటీమణి ఇంకెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. నేడు సెప్టెంబరు 7 ఆమె జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుందాం.

మహిళలు, పురుషుల కంటే ఎందులోనూ తక్కువ కాదని చేతలలో నిరూపించిన గొప్ప మహిళ ఆమె. ఆమె 1925లో ఒంగోలులో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్యగారు శాస్త్రీయ సంగీత ప్రియుడు. ఆమె సంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ తన 13 వ యేటలోనే 1939లో విడుదలైన ‘వరవిక్రయం’ అనే సినిమాలో నటించారు. ఆమె దాదాపు 50 సంవత్సరాలకు పైగా చిత్రపరిశ్రమలో ఉన్నప్పటికీ.. ఆమె మొత్తం 100 సినిమాల్లో మాత్రమే నటించారు. ఆమె నటించిన ముఖ్యమైన సినిమాల్లో మల్లీశ్వరి సినిమాను ఒక ఆణిముత్యంగా చెప్పవచ్చు. ఎన్టీఆర్‌తో పోటాపోటీగా ఆ చిత్రంలో నటించారామె. పాటలు కూడా స్వయంగా పాడుకునేవారు. ఆమె గొంతులో ఒకరకమైన గాంభీర్యం ఉండేది. ఆమె సినిమాకు సంబంధించిన ఆన్ని రంగాలలో కాలుపెట్టి, బహుముఖప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్నారు.
ఆమె తెలుగు.తమిళ చిత్ర నిర్మాత-దర్శకులు అయిన శ్రీ రామకృష్ణారావును ప్రేమించి, పెళ్లిచేసుకున్నారు. వారి ఏకైక సంతానం భరణి. భరణి అనే పేరుమీదే స్టూడియోను నిర్మించి, అనేక చిత్రాలను నిర్మించారు ఈ దంపతులు.

భానుమతి ప్రతిభకు ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి.
1. 1956 నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారము
2. మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
3. 1966 లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటి ఎంతో ప్రసిద్ధి పొందింది. దీనికి ఆమెకు పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
4. 1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.
5. 1984 లో కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
6. బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
7. 1984 లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
8. 1986 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
9. 1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
10. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో భానుమతికి స్థానం దక్కించుకుంది.
2005 వ సంవత్సరం డిసెంబర్ 24న చెన్నైలోని తన స్వగృహంలో భానుమతి తుదిశ్వాస విడిచారు. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి, నేటి తరం నటీమణులకు ఆదర్శంగా నిలిచింది భానుమతిగారు.

ఆమె నటించిన కొన్ని గొప్పచిత్రాలు
వరవిక్రయం, ధర్మపత్ని, కృష్ణప్రేమ, స్వర్గసీమ, గృహప్రవేశం, అపూర్వసహోదరులు, లైలామజ్ఞు, మల్లీశ్వరి, చంఢీరాణి, చక్రపాణి, అగ్గిరాముడు, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, చింతామణి, ఆలీబాబా 40 దొంగలు, సారంగధర, వరుడు కావాలి, బాటసారి, వివాహబంధం, తోడునీడ, అంతస్తులు, పుణ్యవతి, గృహలక్ష్మి, అంతా మన మంచికే, తాతమ్మకల, మంగమ్మగారి మనవడు, బామ్మ మాట బంగారు బాట, చామంతి, పెద్దరికం, పెళ్లికానుక.
హీరోయిన్‌గానే కాక కారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతో పేరు సంపాదించారు భానుమతి.