180 కిలోమీటర్ల ఆధ్యాత్మిక పాదయాత్ర…ద్వారక చేరుకున్న అనంత్ అంబానీ..
భారత బిజినెస్ దిగ్గజం ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ సాహసోపేతమైన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. గుజరాత్లోని జామ్ నగర్ నుండి 180 కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేసి, ద్వారకలోని శ్రీకృష్ణమందిరాన్ని ఆదివారం శ్రీరామనవమి రోజు చేరుకున్నారు. అక్కడ తన తల్లి నీతా అంబానీ, భార్య రాధికామర్చంట్లను కలుసుకున్నారు. అరుదైన హార్మోన్ల రుగ్మత అయిన కుషింగ్స్ సిండ్రోమ్, అనారోగ్యకరమైన ఊబకాయం, ఉబ్బసం, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి వల్ల కలిగే బలహీనతను అధిగమించి అంబానీ పాదయాత్ర చేపట్టడం విశేషం. ఈ ఆధ్యాత్మిక పాదయాత్రలో, అనంత్ ద్వారకకు వెళ్లే మార్గంలో హనుమాన్ చాలీసా, సుందర్కాండ, దేవి స్తోత్రాన్ని పఠించానని ఎంతో శక్తిని, ధైర్యాన్ని కలిగించాయని పేర్కొన్నారు. సనాతన ధర్మంపై తనకున్న భక్తిని, ఆసక్తిని అనంత్ అంబానీ ఎన్నో సార్లు బహిరంగంగానే వ్యక్త పరిచారు. అంతేకాదు, వన్యప్రాణులపై కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ, జామ్నగర్లో వేల ఎకరాల అడవిని, వన్యప్రాణి సంరక్షణా కేంద్రం వంతారాను ఏర్పాటు చేసి, దాని బాధ్యతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా వంతారాను సందర్శించిన సంగతి తెలిసిందే.