సిరియాలో కుటుంబపాలనకు స్వస్తి..పారిపోయిన దేశాధ్యక్షుడు
సిరియాలో ఐదున్నర దశాబ్దాల అసద్ కుటుంబ పాలనకు స్వస్తి పలికారు తిరుగుబాటుదారులు. రాజధాని డమాస్క్‌స్‌లోనికి ప్రవేశించడంతో దేశాధ్యక్షుడు బషర్ అల్-అసద్ కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయారు. రష్యాకు శరణార్థిగా చేరుకున్నట్లు సమాచారం. నిరంకుశ పాలన నుండి తమకు విముక్తి కలిగిందంటూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ పరిణామాలపై సిరియా ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వీడియో సందేశం విడుదల చేశారు. అధ్యక్షుడు అసద్ వెళ్లిపోయాక ఆయన అధ్యక్ష భవనంలోకి ఆందోళనకారులు భారీగా చొరబడ్డారు. విలాసవంతమైన ఆరంతస్తుల ఆ భవనంలో ఫర్నిచర్, వస్తువులు, ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియాలో అసద్‌ను గద్దె దింపేందుకు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు తిరుగుబాటుదార్లు. నవంబర్ నెలాఖర్లో మరోమారు ఆక్రమణ ప్రయత్నం చేసి, అలెప్పో, హమా, హామ్స్ వంటి నగరాలను ఆక్రమించుకుంటూ రాజధాని డమాస్క్‌స్ వైపు దూసుకొచ్చారు. ప్రభుత్వ బలగాలు వారిని అడ్డుకోలేకపోవడంతో చేసేది లేక పలాయనం అయ్యారు అసద్.