“21శతాబ్ది ప్రపంచ విజేతగా అమెరికాను నిలబెడతా”..కమలాహారిస్
తాను అమెరికా అధ్యక్షురాలిగా అధికారంలోకి వస్తే అమెరికాను 21వ శతాబ్ది ప్రపంచ విజేతగా నిలబెడతానని హామీ ఇచ్చారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్. అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తానన్నారు. నాటో కూటమి దేశాలతో పాటు ఉక్రెయిన్‌కు అండగా ఉంటానని వెల్లడించారు. గురువారం అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ పార్టీ జాతీయ సమావేశంలో ప్రసంగించారు. పార్టీ, జాతి, భాషతో సంబంధం లేకుండా ప్రతి అమెరికన్ తరపున నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీలు, వర్గాలుగా చీలిపోకుండా అమెరికన్లు కొత్త మార్గాన్ని సృష్టించుకుందామని, అమెరికాను బలోపేతం చేస్తానని, ప్రపంచ నాయకత్వాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు.
ఈ ప్రసంగంలో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ట్రంప్ నిబద్ధత ఉన్న నాయకుడు కాదని, ఆయన ఎన్నికై శ్వేతసౌధంలోకి అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికన్లను హెచ్చరించారు. ట్రంప్‌కు అధికారం లభిస్తే పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తారని, గతంలో క్యాపిటల్ హిల్‌పైనే దాడికి ఉసిగొల్పాడని ఆరోపించారు. కమలా హారిస్ ప్రసంగం యావత్తూ చప్పట్లు, స్టాండింగ్ ఒవేషన్లు, ప్లకార్డులతో నిండిపోయింది. ఆమె మద్దతు దారులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు జో బైడన్ దంపతులు కూడా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాజ్ కలిసి దేశానికి గొప్ప భవిష్యత్తు అందినస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

