అబద్ధాలు చెప్పడంలో అంబటికి ఆస్కార్ ఇవ్వొచ్చు
పాలకొల్లు: పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా? అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు విసిరిన సవాల్‌ను తీవ్రంగా తప్పుపడుతూ, అది సిగ్గుచేటు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో అంబటికి ఆస్కార్ ఇవ్వొచ్చు, అంటూ ఎద్దేవా చేసిన నిమ్మల రామానాయుడు, పోలవరాన్ని పూర్తి చేయకుండా చేతులెత్తేసిన వ్యక్తి ఎలా ప్రశ్నలు వేస్తాడని ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన అంబటికి పోలవరం ప్రాజెక్టుపై సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరమని మంత్రి విమర్శించారు. మా పార్టీ దిగువ శ్రేణి నాయకులకు ఉన్న అవగాహన కూడా ఆయనకు లేదు, అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి గత ప్రభుత్వ నాసిరకం తీరే కారణమని తెలిపారు. ప్రాజెక్టు భవిష్యత్తును కాపాడుకునే బదులు, వైసీపీ పార్టీ రాజకీయంగా మళ్లీ ఎలా నిలదొక్కుకోవాలా అనే ఆలోచనతో అడ్డదారులు తొక్కుతోందని ఆయన విమర్శించారు.