అద్భుతం.. తెగిన చెయ్యిని అతికించిన వైద్యులు
జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, అద్భుతం సృష్టించారు. రోడ్డు ప్రమాదంలో పూర్తిగా తెగిపడిన చెయ్యిని 8 గంటల పాటు శ్రమించి అతికించగలిగారు. అత్యంత క్లిష్టమైన మైక్రోవ్యాస్క్‌లర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పూర్తి చేతిని ఈ పద్దతిలో అతికించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు పేర్కొన్నారు. మంచిర్యాలకు చెందిన పవన్‌కుమార్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా ప్రమాదం జరిగి మోచేయి పై భాగం వరకూ తెగి పడిపోయింది. తెగిన చేతిని కవర్‌లో చుట్టి, మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించగా, వారు హైదరాబాద్ అపోలోకు పంపించారు. ఇది జరిగి 26 రోజులయ్యింది. ఇప్పటికి పవన్ కోలుకున్నాడని, అతికించిన చేతివేళ్లు పనిచేయడానికి మరో ఆరునెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి శస్త్ర చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ఇలా తెగిన భాగాలను నేరుగా ఐస్ కవర్‌లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. వాటిని కవర్‌లో పెట్టి, కవర్‌ను ఐస్ ప్యాక్‌లో పెట్టి, గంట లోపల ( గోల్డెన్ అవర్)లో తీసుకువస్తే శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగే అవకాశం ఉందన్నారు.