జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతుల నిరసన
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. తమ ఉద్యమాన్ని ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని రైతులు నిర్ణయించారు. దీనిలో భాగంగా ధరణికోట టు ఎర్రకోట అనే పేరుతో ప్రత్యేక రైలులో రైతులు డిల్లీ చేరుకున్నారు. రైతుల నిరసనకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ పార్టీలు మద్దతు పలికాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల ముఖ్య నేతలను రైతులు కలవనున్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించనున్నారు. సోమవారం రాంలీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో రైతులు పాల్గొననున్నారు.