‘ఆ పార్టీతో పొత్తు పెట్టుకో’..విజయ్‌కి పీకే సలహా
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో విజయ్‌ని గెలిపించడానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. జాతీయ పార్టీలతో పొత్తు కలవని విజయ్ తనకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో డీఎంకే పార్టీ శత్రువులని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పీకే కొన్ని ముఖ్య సూచనలు చేశారు. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ఓటు బ్యాంకు కలిగిన అన్నాడీఎంకే కూటమితో పొత్తు కుదుర్చుకోమని చెప్పినట్లు సమాచారం. దీనితో డీఎంకేను ఎదుర్కోవచ్చని సలహా ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వాన్ని ఉదాహరణగా చెప్పారు. పళనిస్వామి సీఎంగా, విజయ్ డిప్యూటీ సీఎంగా ఉండవచ్చని సలహా ఇచ్చారు. అన్నాడీఎంకేకు ఉన్న ఓట్ల శాతం, ఆ పార్టీలోని ఇతర పార్టీలు కలిపి 30 శాతం ఓట్లు వస్తాయని, విజయ్ మరో 20 శాతం ఓట్లు సాధించగలిగితే మొత్తం 50 శాతం పైన ఓటుబ్యాంకు దక్కుతుందని ప్రశాంత్ కిశోర్ సలహా. అయితే ఈ విషయంలో విజయ్ ఇంకా సందిగ్థతలోనే ఉన్నారని సమాచారం.

