వైసీపీ కంచుకోటలో కూటమి కుప్పిగంతులు
కూటమి ప్రభుత్వం రాయలసీమపై పట్టు సాధించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కడపలో వైసీపీ పట్టుకోల్పోవడంతో వీరి ఆశలు చిగురించినట్లుగా కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల తర్వాత కూటమి చూపంతా రాయలసీమ పై పడినట్లుగా తెలుస్తోంది. వైసీపీని కడప జిల్లాలో కోలుకోకుండా చేస్తే ఇక మనకు తిరుగు ఉండదని భావిస్తున్నారట. అధికారంలోకి వచ్చిన వెంటనే మహానాడుకు కడపనే వేదికగా ఎంచుకున్నట్లుగా అర్ధం అవుతోంది. జగన్ కంచుకోటలో మూడురోజుల పాటు మహానాడు నిర్వహించిన టీడీపీ లక్షలాది మందితో సభ పెట్టి జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో కడపను పసుపుమయం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత అనేక నగరాల్లో మహానాడు నిర్వహించారు కానీ మొదటి సారిగా కడపను టార్గెట్ చేస్తూ వైసీపీకి తన సత్తా చూపే ప్రయత్నం చేశారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా వరుసగా కడప పర్యటనలు చేస్తూ..జగన్ పార్టీ నేతలకు వార్నింగ్‌లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకోపక్క కూటమిలో మరో మిత్రపక్షమైన బీజేపీ కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అయింది. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన పీవీఎన్ మాధవ్ రాష్ట్ర పర్యటనలకు కడప నుంచే సిద్ధమయ్యారు. అంటే కాకుండా కడపను రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నాం.. అందుకే మొదటగా కడపను ఎంచుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్..తన తొలి రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచే కాకుండా కడప నుంచి ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే ఎంచుకున్నాయి. ఇక కడపలో పర్యటించిన పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న అటవీ భూములను పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా నెలలో కనీసం రెండు సార్లకు తక్కువ కాకుండా సీమ జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా రాయలసీమ పైనే ఫోకస్ పెట్టింది. దీంతో రాయలసీమలో వైసీపీ వర్సెస్ కూటమిగా ఇక్కడ రాజకీయం మారిపోయింది. వైసీపీ మాత్రం తిరిగి తన పట్టును సాధించేందుకు ప్లాన్ చేస్తోంది. మూడు కీలక పార్టీలు కలిసి రాయలసీమ మీద దృష్టి పెట్టడంతో వైసీపీకి ఒక సవాల్‌గా మారింది. జగన్ కంచుకోటలో పాగా వేస్తున్న కూటమి పార్టీల ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.

