ఆ సీట్లన్ని తెలంగాణాకే…ఇక ఏపికి లేనట్లే
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ విద్యార్థులకే సీట్లన్నీ దక్కనున్నాయి. గత పదేళ్లుగా అమలవుతున్న 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా జీవో విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు 15 శాతం నాన్ లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు 15 శాతం కోటా కింద ఏపీతో పాటు తెలంగాణ స్థానికులూ పోటీ పడేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 2024తో పదేళ్లు పూర్తయిన పూర్తవడంతో.. ఈ 15 శాతం కోటా గడువు ముగిసినట్లైంది. గత విద్యా సంవత్సరం నుంచే 15 శాతం కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా నాన్ లోకల్ కోటాను అమలు చేశారు. ఈ మేరకు ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్స్ గైడ్‌లైన్స్‌లో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ఏపి విద్యార్ధులకు పూర్తిగా ఈ నిబంధన మొండి చేయి చూపనుంది.