బీజేపీ నాయకులంతా మునుగోడులోనే బస
రాత్రింబవళ్లు ప్రచారం.. పార్టీ అధిష్టానం ఆదేశం
వ్యూహాలు టీఆర్‌ఎస్‌కు అందకుండా జాగ్రత్తలు
మునుగోడు ఉప ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఇంకా పది రోజులే ఉన్న నేపథ్యంలో రాత్రింబవళ్లు ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ప్రచారం ముగిసే నవంబరు ఒకటో తేదీ వరకూ ఏ నాయకుడూ హైదరాబాద్ రావొద్దని.. తమకు కేటాయించిన ప్రాంతంలోనే బస చేసి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం చేయాలని నిర్దేశించింది. హైదరాబాద్‌లో ఉన్న నాయకులూ వెంటనే మునుగోడు వెళ్లిపోవాలని.. చేరికలను తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రచారంపైనే పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని సూచించింది.

బీజేపీ స్టీరింగ్ కమిటీలోని ఇద్దరు కీలక నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాషాయం పార్టీ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. పార్టీలోని కోవర్టులను కూడా గుర్తించాలని నాయకులను ఆదేశించింది. తెలంగాణాలో టీఆర్‌ఎస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే కోరి తెచ్చుకున్న మునుగోడులో బీజేపీని గెలిపించి తీరాల్సిందేనని రాష్ట్ర నాయకులకు పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ ఎన్నికను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షిస్తుండటం విశేషం. టీఆర్‌ఎస్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా పర్యవేక్షిస్తుండటం ఈ ఎన్నిక రెండు పార్టీలకూ కీలకంగా మారింది. తమ వ్యూహాలు, ఎత్తుగడలు, సమాచారం టీఆర్‌ఎస్‌కు లీక్ కాకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

