ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు
టాలీవుడ్ కమెడియన్ అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నేడు బాధ్యతలు చేపట్టారు. అధికారులు వెంట రాగా తన చాంబర్‌లో ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెడతానన్నారు. ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తే తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషా సినిమాలకు కూడా షూటింగులు జరుపుకుంటాయని అభిప్రాయపడ్డారు. దీంతో అక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని అలీ పేర్కొన్నారు.