శరద్ పవారే మాకు స్ఫూర్తంటూనే అధ్యక్ష పదవి నుండి తొలగించిన అజిత్ పవార్
మహారాష్ట్ర రాజకీయాలలో ‘పవార్’ ఫుల్ రాజకీయాలు నడుస్తున్నాయి. పవార్ వెర్సస్ పవార్ గేమ్‌లో బాబాయిపై పై చేయి సాధించాడు రెబల్ నేత అజిత్ పవార్. ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో మెజారిటీ నిరూపించుకున్న అజిత్ చివరికి శరద్ పవార్‌ను ఎన్సీపీ అధ్యక్షపదవి నుండి తొలగించాడు. ఎప్పటికీ మీరే మాకు స్ఫూర్తి, మీరే గురువు దైవం అంటూ సన్నాయినొక్కులు నొక్కిన అబ్బాయి ఇక వయస్సయ్యింది ఇంట్లో కూర్చోమంటూ ఆయనను రిటైర్ చేసేశాడు. 83 ఏళ్ల వయస్సులో ఇంకా మీకు రాజకీయాలెందుకన్నాడు. తమకు మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శరద్ పవార్‌కు కేవలం 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల కమీషన్‌కు లేఖ రాసారు. ఇటీవల తమ పార్టీ అధిష్టానం పైనే తిరుగుబాటు చేసి, తన వర్గం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలిపారు. దీనితో డిప్యూటీ సీఎం పదవిని అలంకరించారు.

