ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో AI విధానం: సీఎం జగన్
ఈ రోజు ఏపీలో వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూర్‌లో ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. క్రోసూర్‌లో ఏపీ మోడల్ స్కూల్‌ను సీఎం జగన్ సందర్శించి డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్ రూమ్‌లో విద్యార్థులతో ముచ్చటించి పాఠ్యపుస్తకాలను పరిశీలించారు.

ఇంటరాక్టివ్ ప్యాడ్ ప్యానల్‌పై ఆల్ ది బెస్ట్ అని రాసి విద్యార్థులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.కాగా సీఎం జగన్ మాట్లాడుతూ..“పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో భోధన విలువలను పెంచేందుకు AI సాధనాలు, మెషిన్ లెర్నింగ్ విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం జగన్ తెలిపారు. అంతర్జాతీయ ప్రామాణాలతో బోధన స్థాయి ఉంటుందని అన్నారు. ఈ ఏడాది మీ జగనన్న పుట్టినరోజునే 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు అందిస్తామని తెలిపారు.

