ఏపీలో దూకుడుగా ఏసీబీ దాడులు-కోట్లకొలది సొమ్ము, ఆస్తులు స్వాధీనం
విజయవాడలో ఏసీబీ పోలీసులు రెండురోజులుగా దూకుడుగా అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒక్కరోజులోనే ముగ్గురు ప్రభుత్వాధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కోట్ల కొలది నగదును స్వాధీనం చేసుకున్నారు. దుర్గగుడి ఏవో నగేష్ ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. పదుల సంఖ్యలో ఇళ్లు,కమర్షియల్ బిల్డింగ్స్, పొలాలు, స్థలాలను గుర్తించి అవాక్కయ్యారు ఏసీబీ పోలీసులు. ఇంకా కోట్ల కొలది డబ్బు, కార్లు, టూవీలర్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్యాంకు లాకర్లను కూడా గుర్తించి వాటిని కూడా ఓపెన్ చేయబోతున్నారు.

తాడేపల్లి, జంగారెడ్డి గూడెంలో ఇళ్లు, నిడదవోలులో ఇంకో ఇళ్లు, మరో ఫ్లాట్‌ను కూడా గుర్తించారు. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన నగేష్‌తో నాకు సంబందం లేదని దుర్గగుడి చైర్మన్ రాంబాబు తెలిపారు. ఈవో భ్రమరాంబపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నగేశ్‌కు సహకరించిన వారిపై ఏసీబీ చర్యలు తీసుకోవాలని కోరారు.

విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావు ఇంట్లో కూడా సోదాలు చేశారు. వారి అక్రమాల చిట్టాను తవ్వి తీశారు. ఇక్కడ కూడా పదుల సంఖ్యలో ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఖరీదైన కార్లు, టూవీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. రామవరప్పాడులో డ్యూప్లెక్స్ ఇళ్లు, ప్రామిసరీ నోట్లు, విజయవాడ అవనిగడ్డలో ఇళ్ల స్థలాలు, ఖరీదైన వోక్స్ వాగన్, రెండు జీప్స్, 18 లక్షల గాడ్జెట్స్, 1500 గ్రాముల బంగారు నగలు ఈ సోదాలలో బయటపడ్డాయి.
కర్నూలులోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాత ఇంట్లో కూడా భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. ఆమెకు కర్నూలు కస్తూరి నగర్‌లో ఇళ్లు, బుధవారిపేటలో షాపింగ్ కాంప్లెక్స్, 40 తులాల బంగారం, సుంకేసులలో రెండున్నర ఎకరాల స్థలం, కర్నూలు శివార్లలో 8 ఇళ్ల స్థలాలు, కర్నూలులోనే నాలుగంతస్తుల భవనం లభ్యమయ్యాయి. వీరి బ్యాంకు లాకర్లు ఇంకా తెరవలేదు. తెరిస్తే ఇంకెంత బయటపడుతుందో వేచి చూడాలి. నగేశ్‌ను, రాఘవరావును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

