Home Page SliderInternational

12 ఏళ్ల తర్వాత ఇండియాకు ఓ పాకిస్తాన్ మంత్రి రాక

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశానికి హాజరయ్యేందుకు భారత్ వచ్చారు. దాదాపు 12 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి ఇండియా సందర్శించిన మొదటి సీనియర్ నాయకుడయ్యాడు. SCO కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (CFM) సమావేశానికి హాజరు కావడానికి ఆయన భారత పర్యటనకు వచ్చారు. గోవా విమానాశ్రయంలో పాక్ విదేశాంగ మంత్రికి, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్-ఇరాన్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సంయుక్త కార్యదర్శి జెపి సింగ్ స్వాగతం పలికారు. 2011లో అప్పటి పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ భారత్‌లో పర్యటించి అప్పటి విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణతో చర్చలు జరిపారు. “SCO విదేశాంగ మంత్రుల సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి గోవా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు బిలావల్. సదస్సు విజయవంతమవుతుందని ఆశిస్తున్నానన్నారు.

గోవాకు బయలుదేరే ముందు, పాక్ విదేశాంగ మంత్రి, “ఈ సమావేశానికి హాజరు కావాలనే నా నిర్ణయం SCO చార్టర్ పట్ల పాకిస్తాన్ బలమైన నిబద్ధతను వివరిస్తుంది” అని అన్నారు. “SCOపై ప్రత్యేకంగా దృష్టి సారించిన నా పర్యటన సందర్భంగా, స్నేహపూర్వక దేశాల నుండి నా సహచరులతో నిర్మాణాత్మక చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు. 2011 తర్వాత ఇస్లామాబాద్ నుండి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. మే 2014లో, ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌కు వచ్చారు. డిసెంబరు 2015లో మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌లో పర్యటించారు. కొద్దిరోజుల తర్వాత మోదీ ఆ దేశంలో కొద్దిసేపు పర్యటించారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరపాలని ప్రతిపాదించిన కొన్ని రోజుల తర్వాత SCO సమావేశానికి హాజరు కావాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రికి జనవరిలో ఆహ్వానం పంపించారు.

యుఎఇకి చెందిన అల్ అరేబియా న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, షరీఫ్ మాట్లాడుతూ, భారతదేశంతో మూడు యుద్ధాల తర్వాత పాకిస్తాన్ పాఠం నేర్చుకుందని, ఇప్పుడు “మా నిజమైన సమస్యలను మనం పరిష్కరించుకోగలిగితే” భారత్‌తో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నట్లు షరీఫ్ అన్నారు. అయితే, కశ్మీర్‌పై 2019 చర్యలను భారత్ ఉపసంహరించుకోకుండా చర్చలు సాధ్యం కాదని పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం తరువాత పేర్కొంది. పాకిస్తాన్‌తోసహా, సాధారణ పొరుగు దేశాలతో సంబంధాలను కోరుకుంటున్నట్లు చెబుతూనే, ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పై ఉందని భారత్ స్పష్టం చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేయడంతో ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆగస్టు 2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఉపసంహరించుకోవడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు భారతదేశం ప్రకటించిన తర్వాత సంబంధాలు మరింత క్షీణించాయి.

ఇండియాలో జరిగే SCO సమావేశానికి హాజరు కావాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం SCO చార్టర్ నిబద్ధతను చాటుతోందని, భాగస్వామ్య దేశాల మధ్య శాంతిని పెంపొందించడానికి తన వంతు పాత్రను పోషించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు ఆ దేశ ప్రధాని షెబాజ్ షరీఫ్. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం, మా భాగస్వామ్య విలువలను ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు పాత్రను పోషించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. కనెక్టివిటీ, వాణిజ్యం, పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఆధారపడి విన్-విన్ సిట్యువేషన్‌ను పాకిస్తాన్ కోరుకుంటుందన్నారు.