తాలిబన్ల ఏడాదిపాలనలో మరింత నిరుపేదగా మారిన అఫ్ఘనిస్తాన్
అఫ్ఘనిస్తాన్…ఎప్పుడు ఈపేరు విన్నా గుర్తొచ్చేది కరుడు గట్టిన ఉగ్రవాదం, చదువుకి దూరమైన అమ్మాయిలు, చేతుల్లో తుపాకులతో రోడ్లపై తిరుగాడే యువకులు. కానీ ఒకప్పుడు ఈదేశం గొప్ప సంస్కృతి, సంపదలతో తులతూగినదే.. ప్రాచీన శిలాయుగం నుండి ఇక్కడ మానవులు నివాసం ఉన్న దాఖలాలు ఉన్నాయి. అలెగ్జాండర్, మౌర్యులు, అరబ్బులు, మంగోళీలు, బ్రిటిషర్స్ ఇలా ఎందరో ఇక్కడ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసారు. పురాణ కాలంలో ఈ దేశాన్ని గాంధార దేశంగా పిలిచే వారు. కానీ యుగాలు మారిపోయాయి. కాలాలు దొర్లిపోయాయి. కేలండర్లు తిరిగి పోయాయి. ఇప్పుడ అక్కడ అంతా క్రూరత్వమే రాజ్యమేలుతోంది. భయం నీడలోనే కాలం గడిచి పోతూ ఉంది. మొరటుగా, మొండిగా ఉండే అఫ్గాన్లు దేనికైనా తెగించే స్వభావాన్ని అలవరచుకున్నారు. తెగింపు, తెగువ పెరిగిపోయింది. కాలక్రమంలో అఫ్ఘనిస్తాన్ పూర్తి ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. బతకలేని, బతుకులేని జీవితాలే అక్కడ ఎక్కువయ్యాయి. దేశం విడిచి బయటపడేందుకు ఇష్టపడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ముస్లిం చట్టాల ముసుగులో అరాచకాలు పెరిగి పోయాయి. పైశాచికత్వం ప్రబలిపోయింది. హింస వేళ్ళూనుకుంది. ముఖ్యంగా మహిళల పట్ల అక్కడ జరిగే అరాచాకాలు అన్నీ ఇన్నీ కావు. ఓ బానిసలా చూస్తారు. చదువులకు దూరం చేసి నియంతృత్వంగా ఉండాలన్నారు. అదేమంటే తుపాకులు పేలతాయి. బహిరంగంగా కొట్టి చంపేస్తారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆఫ్గన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. కాకలు దీరిన తీవ్రవాదులకు అడ్డా అయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌ని ఆక్రమించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో అక్కడ మళ్ళీ పరిస్ధితులు తారుమారు అయ్యాయి. అప్పటి వరకు ఉన్న కొద్దో గొప్పో పరిస్ధితులు తిరిగి చెల్లాచెదురుగా మారిపోయాయి. సరిగ్గా తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకుని ఏడాది గడిచింది. అధికారంలోకి రావడమే ఆలస్యం..దేశం పేరును ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘనిస్తాన్ గా మార్చేశారు. అరాచక పాలనకు తెరతీశారు. అప్పటి వరకు అమెరికా కొమ్ము కాసిన వారందరినీ ఏరి మరీ చంపేశారు. ఆ భయంతోనే వేలాది మంది ప్రాణాలను ఉగ్గబట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు.

అయితే ఇప్పటి వరకు తాలిబన్లకు సరైన అధికార యంత్రాంగం లేదు. ఒక పద్దతి, ప్రణాళిక అంటూ ఏమీలేవు. పూర్తిగా మత ఛాందస వాదులైన వీరు బాలికలు, మహిళలు చదువుకోవాలంటే ఎన్నో అడ్డంకులు కలుగజేస్తున్నారు. వీరి పాలనలో పేదరికం వెక్కిరిస్తోంది. ఆకలి కేకలు అలవాటుగా మారుతున్నాయి. తిండిలేక.. పని లేక.. ఉద్యోగాలు లేక.. ఉపాధి లేక, దేశం మొత్తం సంక్షోభంలో కూరుకు పోతోంది. చదువుకోవాలన్న కోరిక ఉన్నా.. తెలియని భయం. ప్రాణం తీస్తారేమో అన్న భీతి. అయినా రహస్యంగా విద్యాభ్యాసన చేస్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది.

తమ ఏడాది పాలనను విజయంగా చెప్పుకుంటూ బైక్‌లపై తిరుగుతూ ర్యాలీలు నిర్వహించారు తాలిబన్లు. అమెరికా రాయబార కార్యాలయం వద్ద “DEATH TO AMERICA” అంటూ నినాదాలిచ్చి, పాఠశాలలకు సెలవలు ప్రకటించారు. తాలిబన్ల పాలనకు ప్రపంచం నుండి ఏ గుర్తింపూ లేదు. వీరి పాలనకు కేవలం చైనా, పాకిస్తాన్ మాత్రమే మద్దతు ఇచ్చాయి. అఫ్ఘాన్‌లో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఐక్యరాజ్య సమితితో పాటు అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈమధ్య కాలంలో భారత్ పట్ల తాలిబన్ల వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో భారత్ సాయాన్ని కోరుతోంది. అయితే వారి ఛాందస భావాలు, మహిళలపై వారి వైఖరి మారకపోవడంతో పలు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ మాత్రం అఫ్గానిస్థాన్ ప్రజలు సుస్థిర శాంతి సమృద్ధితో వికసించేందుకు తోడ్పడతామని వెల్లడించింది. భారత్ కూడా సాధ్యమయినంత సహాయ పడతామని మాటిచ్చింది. భర్తృహరి మాటల్లో చెప్పాలంటే.. ఆఫ్ఘన్ లో శాంతిని ఆశించడం అంటే.. తిమిరి ఇసుమున తైలంబు తీసినట్టే.

