Home Page Sliderhome page sliderTelangana

త్వరలో పట్టణాలకు అదనపు తహశీల్దార్లు

రాష్ట్రంలోని అధిక జనాభా కలిగిన పట్టణ ప్రాంతాల్లో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు త్వరలోనే అదనపు తహశీల్దార్లను కేటాయించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 1.5 లక్షల నుంచి 2 లక్షల జనాభా ఉన్న పట్టణాలు అనేకం ఉన్నాయని , ఇంత భారీ జనాభాకు ఒకరే తహశీల్దార్ ఉండటం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమని పొంగులేటి తెలిపారు . ఈ సమస్యను పరిష్కరించేందుకు అదనపు అధికారుల నియామకంపై త్వరలోనే కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని భరోసా ఇచ్చారు.

రాజకీయ విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా, మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్ అనడం కేటీఆర్ పగటి కలలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. “సొంత ఇంటి ఆడబిడ్డకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?” అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించిందని, పేదలకు ఇళ్లు ఇచ్చే ఆలోచన చేయలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ వంటి ప్రజాహిత కార్యక్రమాలతో ముందుకెళ్తోందని, అందుకే ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.