home page sliderHome Page SliderTelangana

అధికారులకు జవాబుదారీతనమే ముఖ్యం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం ఐడీఓసీలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారుల చిత్తశుద్ధే కొలమానమని పేర్కొన్నారు. గతంలో జరిగిన పనుల్లో సాంకేతిక లోపాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో డ్రైనేజీ లెవల్స్ సరిగా లేక మురుగునీరు నిలిచిపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఎక్కడైతే నీరు ఆగుతుందో ఆ ప్రాంతాలను వెంటనే గుర్తించి, అవసరమైతే పాత నిర్మాణాలను తొలగించి కొత్తవి నిర్మించాలని, ఆ పొరపాట్లకు కారణమైన అధికారులను రికార్డుల ద్వారా గుర్తించి బాధ్యులను చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ , రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలకు ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం, ఇల్లెందు వంటి ప్రాంతాల్లో రైతులు ఈ సమస్యతో సతమతమవుతున్నారని, కలెక్టర్లు ,డి.ఎఫ్.ఓలు ఉమ్మడిగా క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించి సరిహద్దులను ఖరారు చేయాలని సూచించారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు ,ఇతర ప్రజాప్రతినిధులకు ఈ నెల 12న ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీ నిధుల వినియోగం , గ్రామాభివృద్ధిపై వారికి పూర్తి అవగాహన కల్పించడం ద్వారా అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

వ్యవసాయ రంగంలో రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి రైతుకు భూసార పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాలని మంత్రి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అధికారులే నేరుగా రైతుల వద్దకు వెళ్లి ఆధునిక సాగు పద్ధతులను వివరించాలని, అవసరమైతే ఆదర్శవంతమైన సాగు క్షేత్రాలను సందర్శించేలా రైతులకు ప్రభుత్వ ఖర్చుతో పర్యటనలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉన్నప్పటికీ, గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసమే పనిచేయాలని హితవు పలికారు. విద్య, వైద్యం , వ్యవసాయం వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నూటికి నూరు శాతం ప్రజలకు చేరవేసేలా యంత్రాంగం కదలాలని మంత్రి పిలుపునిచ్చారు.