ఏసీ వల్ల ‘డ్రై ఐ సిండ్రోమ్’
అధిక సమయం ఏసీలో గడిపేవారికి కళ్లకు ముప్పు రావొచ్చని ఒక అధ్యయనం తేల్చింది. తరచూ ఏసీలోనే ఉండేవారికి డ్రై ఐ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఏసీలో గడపడం వల్ల ఏసీ చల్లదనానికి గాలి నుండి తేమ దూరమవుతుంది. దీని ఫలితంగా కళ్లు తేమను కోల్పోతాయి. దీనివల్ల కళ్లు మంట, దురద, ఎర్రగా మారడం, చూపు మందగించడం, కళ్ల నుండి నీరు కారడం, వెలుగును తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కళ్లు పొడిబారిపోయి డ్రై ఐ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇదే సమస్య స్క్రీన్ టైమ్ ఎక్కువ అవడం వల్ల కూడా ఏర్పడుతుంది. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, కాలుష్యం, నిద్రలేకపోవడం కూడా ఈ సమస్యకు కారణంగా చెప్పవచ్చు.
డ్రై ఐ సిండ్రోమ్ ను నిర్లక్ష్యం చేస్తే అది కార్నియాను దెబ్బతీస్తుంది. తద్వారా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. డయాబెటిస్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఈ సిండ్రోమ్ ఇంకా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మందులతో తగ్గించవచ్చు. కాస్త ముదిరితే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీని తక్కువ స్థాయిలో ఉంచకూడదు. ఏసీ గాలి నేరుగా తగిలకుండా చూసుకోవాలి. స్క్రీన్ ఉపయోగించేటప్పుడు కూడా కళ్లు ఆర్పుతూ ఉండాలి. గదిలో తేమ ఉండేలా చూసుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి. కళ్లను తడిగా ఉంచడానికి డ్రాప్స్ వాడుతూ ఉండాలి.

