ఉరేసుకొని మఠాధిపతి బలవన్మరణం
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొన్న కర్ణాటక రాష్ట్రంలోని మరో మఠాధిపతి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ రాష్ట్రంలో ఇప్పటికే కొందరు మఠాధిపతులపై లైంగిక దాడి ఆరోపణలు వెల్లువెత్తాయి.
పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఇటీవలే అరెస్టు అయ్యారు. ఉన్నత పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మరో మఠాధిపతి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్ణాటకలోని మఠాల్లో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ కొందరు విడుదల చేసిన ఓ వీడియో సంచలనంగా మారింది. అందులో బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్ మఠ్‌కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి పేరు కూడా ప్రస్తావించారు. దీంతో మనస్తాపంతో ఆయన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బసవ సిద్ధలింగ స్వామి తన నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఆయన అనుచరులు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో సూసైడ్ నోటు దొరికింది. దానిలో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.