NewsTelangana

టీఆర్ఎస్‌ను తరుముకొస్తున్న బీజేపీ… ఆరా సర్వే ట్విస్ట్

ఆరా సర్వే సంస్థ విడుదల చేసిన మీడియా ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులు… పార్టీల బలాబలాలు… ఓటర్ల ప్రవర్తనపై ఆరా సంస్థ ప్రతి మూడు నెలలకు ఒకసారి… 119 నియోజకవర్గాల్లోని మూడోవంతు నియోజకవర్గాలలో సర్వేలు నిర్వహించాం.

ఈ విధంగా 2021 నవంబర్, మరియు 2022 మార్చి జులైలో మూడు దఫాలుగా తెలంగాణలోని మొత్తం నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాం.

ప్రతి విడతలో సర్వే నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రంలోని అన్ని రకాల నియోజకవర్గాలు, కలిసివచ్చేట్టుగా… ఎస్సీ 6 నుండి 7 నియోజకవర్గాలు, ఎస్టీ 3 నుండి 4 నియోజకవర్గాలు, పట్టణ నియోజకవర్గాలు 10 నుండి 11, గ్రామీణ నియోజకవర్గాలు 18 నుండి 19లో సర్వే నిర్వహించడం జరిగింది.

పై మూడు విడతలలో వివిధ పార్టీలకు వచ్చిన సరాసరి ఓట్ల శాతం టీఆర్ఎస్ 38.88%, బీజేపీ 30.48 % కాంగ్రెస్ 23.71%, ఇతరులు 6.91% సాధించారు.

వివిధ జిల్లాల్లో ఉన్న రాజకీయ పార్టీల స్థితిగతులను బట్టి… ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పాత జిల్లాలను ఒక జోన్ గా విభజించగా… అందులో టీఆర్ఎస్ 39.07%, బీజేపీ 35.69%, కాంగ్రెస్ 18.91%, ఇతరులు 6.31% ఓట్లు రానున్నాయ్.

మెదక్, మహబూబ్ నగర్‌లో టీఆర్ఎస్ 40.89, బీజేపీ 30.37, కాంగ్రెస్ 23.38, ఇతరులు 5.34 ఓట్లు రానున్నాయ్.

హైదరాబాద్, రంగారెడ్డిలో టీఆర్ఎస్ 40.43, బీజేపీ 35.32, కాంగ్రెస్ 16.33, ఇతరులు 7.92 ఓట్లు రానున్నాయ్.

వరంగల్, ఖమ్మం, నల్గొండలో టీఆర్ఎస్ 35.14, బీజేపీ 20.54, కాంగ్రెస్ 36.22, ఇతరులు 8.10 రానున్నాయ్.

2018 ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్… నాలుగు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 5 శాతం ఓట్లను కోల్పోయి 41.71 శాతమే సాధించింది. ప్రస్తుత సర్వే ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే… 8 శాతం ఓట్లను కోల్పోయి 38.88 శాతం ఓట్లను పొందనున్నది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 29.78 శాతం ఓట్లను సాధించింది. ప్రస్తుత సర్వేలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే… 4.72 శాతం ఓట్లను కోల్పోయి… 23.71 శాతానికి పరిమితం కాబోతుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లను సాధించిన బీజేపీ… 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19.65 శాతం ఓట్లను సాధించింది. ప్రస్తుత సర్వే ప్రకారం… 2018 అసెంబ్లీ ఎన్నికలకంటే… 23.5 శాతం అధిక ఓట్లను సాధించి 30.48 శాతం ఓట్లను పొందనుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 17.72 శాతం ఓట్లను సాధించిన ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 8.86 శాతం సాధించారు.
ప్రస్తుతం వారికి 6.91 శాతం ఓట్లు పొందనున్నారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రముఖ పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది.

వరంగల్, ఖమ్మం, నల్గొండలో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నెలకొంది.

మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో త్రిముఖ పోటీ నెలకొంది.

జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండగా… 8 నియోజకవర్గాల్లో నాలుగో స్థానంలో ఉంది.

అధికార టీఆర్ఎస్ పరిపాలన తీరు బాగుందని… ఓటర్లు విశ్వసిస్తున్నప్పటికీ… కేసీఆర్ గారి కుటుంబ ఆధిపత్యం రాష్ట్రంలో పెచ్చుమీరిందనే భావన ప్రబలంగా పెరిగిన కారణంగా… టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ రోజు రోజుకు తగ్గిపోతోంది.

కాంగ్రెస్ పార్టీ… పీసీసీ అధ్యక్షుడి మార్పు కారణంగా… కార్యకర్తలలో ఉత్సాహం వచ్చినప్పటికీ… 2014, 2018లో గెలిచిన అత్యధిక మంది ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరిన కారణంగా… ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లింది.

2019 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం… గతం కంటే తక్కువ ఓట్లు సాధించడంతో… కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని నిలువరించగలదనే అభిప్రాయం ప్రజల్లో కలగడంలేదు.

దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వరుస విజయాలు, మోదీ నాయకత్వం, తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయాలతో టీఆర్ఎస్ పార్టీని బీజేపీ నిలువరించగలదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి 87 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ పార్టీకి 53 నియోజకవర్గాల్లో బీజేపీకి 29 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల ప్రజా సమస్యలకంటే, కేసీఆర్ కుటుంబ పాలనే ప్రతిపక్షాలకు ప్రధాన ఎన్నికల అంశం అయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఇతర పార్టీల నుంచి చేరే బలమైన అభ్యర్థులు మాత్రమే…ఆ పార్టీలను అధికారతీరాలకు చేర్చగలరు.

Read More: ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే?