ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల జాగారం
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి – లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య అగాధం అంతకంతకు పెరుగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గతంలో 1400 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తాజాగా ఆరోపించింది ఆప్. లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఈడీ విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. విచారణ ముగిసేవరకు వినయ్ సక్సేనా రాజీనామా చేయాలంటోన్న ఆప్.. తమ ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలోనే ఉండి నిరసన తెలుపుతారని ప్రకటించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆత్మరక్షణలో పడ్డ ఆప్ నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తోందంటున్నాయి బీజేపీ వర్గాలు. అయితే ఈ అంశంలో ఇప్పటివరకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా అధికారికంగా స్పందించ లేదు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనాపై సంచలన ఆరోపణలు చేశారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో వినయ్ కుమార్ సక్సేనా 1400 కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడ్డారని ఆప్ ఎమ్మెల్యే ఆరోపించారు. 2016 నవంబర్‌లో నోట్ల రద్దు సమయంలో KVIC ఛైర్మన్‌గా ఉన్న వీకే సక్సేనా పాతనోట్ల మార్పిడి కోసం కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారని ఆప్ ఆరోపించింది. KVICఒక్క బ్రాంచ్‌లో సుమారు 22లక్షల రూపాయల మేర పాతనోట్ల మార్పిడీ జరిగిందన్న ఆప్ ఎమ్మెల్యే మొత్తం 7000బ్రాంచ్‌లు ఉన్నాయని వాటిని అనుసరించి సుమారు 1400 కోట్ల రూపాయల మేర నోట్ల మార్పిడి కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రద్దు చేసిన పాత నోట్లను కొత్తనోట్లతో మార్పిడి చేసిన వ్యవహారంపై ఈడీ విచారణ జరపాలని ఆప్ డిమాండ్ చేసింది. దర్యాప్తు ముగిసే వరకు వినయ్ సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని ఆప్ డిమాండ్ చేసింది. దీనిపై రాత్రంతా అసెంబ్లీలో ఉండి తమ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతారని ఆప్ ప్రకటించింది.

ఆప్ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ఖండించారు. సీఎం సంతకం లేకుండా ఉన్న సుమారు 47 ఫైళ్లను లెప్టినెంట్ గవర్నర్ ఇటీవల తిప్పిపంపారని గుప్తా చెప్పారు. ముఖ్యమంత్రి ఫైళ్లపై కనీసం సంతకాలు కూడా చేయడం లేదన్నారాయన. లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు ఫైల్స్ వెళ్తున్నాయి..కానీ వాటిల్లో ప్రభుత్వాధినేత సంతకాలు ఉండటం లేదు..వాళ్లు మాత్రం ఎలాంటి ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణకు లెఫ్టినెంటర్ గవర్నర్ ఇటీవలే సిఫార్సు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 14 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నారు. ఇదిలావుండగానే తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం తన ప్రభుత్వంపైనే ఆయన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు రూ. 20కోట్ల మేర బీజేపీ ఆఫర్ చేసిందని అయితే తమ ఎమ్మెల్యేలను కొనలేకపోయారని..బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమైందని చెబుతూ కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ జరగనుంది. ఇదిలా ఉండగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై 1400 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తాజా ఆరోపణలు చేసింది. అప్-లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య పోరు మున్ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


