అబార్షన్ల వెహికిల్
అమాయకులైన గిరిజన మహిళలనే లక్ష్యంగా చేసుకొని సంచార వాహనంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కాసులకు కక్కుర్తిపడి పుట్టే పిల్లలను కడుపులోనే కడతేర్చుతున్న..ఖమ్మం జిల్లాలో ముగ్గురి నిందితులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయని గతంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేది. నగర శివారు బల్లేపల్లికి చెందిన ఆర్‌ఎంపీ చారి, చింతకాని మండలం కొదుమూరుకు చెందిన ఆర్‌ఎంపీ రాచబంటి మనోజ్ తమ వద్దకు వచ్చే రోగులను ఈమె పనిచేసే ఆసుపత్రికి రిఫర్ చేసేవారు. ఆ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్రమ సంపాదనకు సిద్ధపడ్డ చారి ఆధ్వర్యంలో వీరు ఏడాది క్రితం ఓ కారు కొనుగోలు చేశారు. అందులో అల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం, ఇతర సామగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్తూ గర్భంతో ఉన్న అమాయక గిరిజన మహిళలకు అందులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. గర్భంలో ఉన్నది బాలిక అని తేలితే వీరే ఒక బృందంగా ఏర్పడి గర్భవిచ్ఛిత్తి కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.