గాజాలో భయంకర వ్యాధి- ఔషధాల కరవు
- ఇజ్రాయిల్ దాడులతో భయంకర వ్యాధులకు నిలయంగా
- పోషకాహార లోపంతో గాజాలో మానవీయ సంక్షోభం
- అక్యూట్ ప్లాసిడ్గా వైరస్ తో చిన్నారుల మరణాలు
- ఔషధాల కోరతతో చికిత్స అందుబాటులో లేక అవస్ధలు
గాజా , ఇజ్రాయెల్ యుద్ధంలో పెద్ద ఎత్తున మానవీయ సంక్షోభం ఏర్పడింది. అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాజాలో ప్రజలు ఆకలితో మరిణిస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయంగా వత్తిడి వచ్చినప్పుడల్లా ఆయన బేఖాతరు చేస్తున్నారు. రోజురోజుకు గాజా వాస్తవికత చాలా భయంకరమైనదిగా మారుతోంది. ఇక్కడి ప్రజలు పోషకాహార లోపం కారణంతో భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం గాజాలో ఒక ప్రమాదకరమైన వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధికి గాజాలో చికిత్స అందజేయలేని పరిస్థితి చోటుచేసుకుంది.
వింత సిండ్రోమ్..చిన్నారుల పాలిట శాపం గాజాలో ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి చిన్న పిల్లల పాలిట పెను ప్రమాదంగా మారింది. ఇది పక్షవాతం వంటి వ్యాధులకు కారణమవుతుందని అక్కడి డాక్టర్లు పెర్కొంటున్నారు. గాజాలో పిల్లలు నిరంతరం ఆకలితో ఉండటం, వారి శరీరానికి అవసరమైన విటమిన్లను అందకపోవడంతో వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నారు. ఈ వ్యాధిని అక్యూట్ ప్లాసిడ్గా డాక్టర్లు గుర్తించారు. ఇది అరుదైన వ్యాధని, రోగిలో కండరాలు అకస్మాత్తుగా బలహీనపడటంతో పాటు శ్వాస తీసుకోవడంలో,ఆహారం మింగడంలో ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ వ్యాధితో జూలై 31 నాటికి 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 32 కేసులు నమోదైనట్లు ప్రకటించారు. గాజాలో ఆరోగ్య సేవల పతనం, పోషకాహార లోపం, అపరిశుభ్ర పరిస్థితులు ఈ వ్యాధికి ప్రధానంగా కారణమని వివరించారు. ఈ ఏడాది పరీక్షించిన కేసుల్లో దాదాపు 70% పోలియోయేతర ఎంటరో వైరస్ లను గుర్తించినట్లు చెప్పారు. గతంలో ఈ సంఖ్య 25% మాత్రమే ఉండేదని వివరించింది. ఇజ్రాయెల్ దేశం బాంబు దాడులతో గాజా మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలి పోవడమే ఇటువంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందడానికి మరో ప్రధాన కారణంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాజాలో అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని వైద్యులు వెల్లడించారు.మరోవైపు అక్టోబర్ 2023 కి ముందు ఈ వ్యాధి చాలా అరుదుగా ఉండేది. గతంలో ప్రతి ఏడాది కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యేవి. గత మూడు నెలల్లో సుమారు 100 కొత్త కేసులు నమోదు చేసుకున్నాయని నివేదికలో వివరించారు. జోర్డాన్, ఇజ్రాయెల్ కు పంపిన ల్యాబ్ నమూనాలలో ఈ కొత్త కేసులను ఎంటరో వైరస్ గా నిర్ధారించారు. ఈ వైరస్ కలుషితమైన నీరు, ధూళి ద్వారా వ్యాపిస్తుందని వెల్లడించారు. గాజాలో గులియన్ బార్ సిండ్రోమ్ కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రకటించింది.
ఔషధాల కొరత.. ఇటీవల గాజాలో చికిత్సకు దాదాపు మార్గాలు లేవని డాక్టర్లు పెర్కొంటున్నారు. 2024 ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న గాజాలోని అల్-షిఫా వైద్యశాలలో నేటివరకు 22 గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు పిల్లలు చనిపోగా , మరో 12 మంది చిన్నారులు శాశ్వత పక్షవాతానికి లోనయ్యారు. ఈ వ్యాధికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (IVIG), ప్లాస్మా మార్పిడి వంటి ఆధునిక చికిత్సలు అవసరమని, ఇజ్రాయెల్ దేశ దిగ్బంధనంతో ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో లేవని డాక్టర్లు తెలిపారు. కనీసం మందులు, చికిత్స యంత్రాలు కూడా అందుబాటులో లేవని వైద్యులు వాపోతున్నారు.