3 వేల కార్లతో వెళ్తున్న నౌక ఫసిపిక్ సముద్రంలో….
మెక్సికోకు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ రవాణానౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం జరిగిన ఈ ఘటనలో నౌకలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రవాణా నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా.. అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. జూన్ 3న ఈ రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా వారందరూ లైఫ్‌బోట్ ద్వారా బయటపడ్డారని వివరించారు. ఆ సమయంలో సమీపంలోని మర్చంట్ మెరైన్ అనే మరో నౌక వారిని రక్షించిందన్నారు. ఓడకు వెనక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండటంతో పెద్దమొత్తంలో పొగలు కనిపించాయని ప్రమాద సమయంలో కోస్ట్ గార్డు అధికారులు, నౌకా సంస్థ తెలిపాయి.