Home Page SliderNational

ఉద్ధవ్ థాక్రేకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ, షిండేకు భారీ ఊరట

గత ఏడాది జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవడానికి బదులుగా థాక్రే రాజీనామా చేశారని కోర్టు ఆక్షేపించింది. థాక్రే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కోల్పోయారంటూ, అప్పటి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చెప్పడాన్ని కోర్టు తప్పుబట్టింది.

మహారాష్ట్రలో యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో… ఉద్ధవ్ థాక్రే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ చర్యలు చట్టబద్ధంగా లేవని చెప్పడం విశేషం. థాక్రే ప్రభుత్వాన్ని బలపరీక్షకు పిలవాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయం అన్యాయమని, అదే సమయంలో బలపరీక్షకు హాజరుకానందున, యథాతథ స్థితిని పునరుద్ధరించడం సాధ్యం కాదని కోర్టు నిర్ధారించింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు షిండేను ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో గవర్నర్ చర్యలు న్యాయబద్ధమేనని కోర్టు పేర్కొంది.