ఆకాశంలో నేటి రాత్రి అరుదైన దృశ్యం..
ఆకాశంలో సోమవారం రాత్రి అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. సౌర కుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. శని, బృహస్పతి (గురు), భూమి.. మూడూ ఒకే సరళ రేఖలో కనిపిస్తాయి. భూమికి అత్యంత చేరువగా గురు గ్రహం రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1963లో ఇలాంటి దృశ్యం చివరిసారి కనిపించింది. భూమికి అతి సమీపంగా వచ్చినప్పుడు గురు గ్రహం చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

మళ్లీ 107 ఏళ్ల తర్వాతే చూడొచ్చు..
ఇలాంటి అరుదైన దృశ్యం మళ్లీ 107 ఏళ్ల తర్వాత కనిపించనుంది. అంటే 2129లో భూమికి బృహస్పతి చేరువగా వస్తుంది. దీన్ని బట్టి భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ ఇలాంటి దృశ్యాన్ని చూసే అవకాశం లభించదన్నమాట. భూమి, బృహస్పతి గ్రహాలు సూర్యుని చుట్టూ కచ్చితమైన వృత్తాకార కక్ష్యలో తిరగవు. అంటే.. వేర్వేరు కోణాలు, దూరాల్లో ప్రయాణిస్తాయి. దీంతో బృహస్పతి గ్రహం అప్పుడప్పుడు భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని ఒక పెద్ద టెలిస్కోప్ సాయంతో వీక్షించవచ్చు. బృహస్పతి గ్రేట్ రెడ్ స్పాట్, చుట్టూ ఉన్న వలయాలను వీక్షించవచ్చు.