ప్రీమెచ్యూర్ శిశువులకి కొత్త ఊపిరి: బాబీ
ఇంటర్నెట్ డెస్క్ : నెలలు నిండకుండా జన్మించే శిశువుల ఊపిరితిత్తుల వ్యవస్థ ఇంకా పూర్తిగా వికసించకపోవడం వల్ల, వారు సాధారణంగా ఊపిరి తీసుకోలేరు. ఇది ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలకు, హృదయ స్పందన తగ్గుదలకు దారితీసి, మెదడు వికాసానికి ఆటంకమవుతుంది. దీనితో ఇలాంటి శిశువులను నియోనాటల్ కేర్ లో ఉంచుతారు. అక్కడ నర్సులు శిశువుల నిరంతర ఊపిరిపై ధ్యాస ఉంచి వారిని కదుపుతూ ఊపిరి తీసుకునేలా చేస్తారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా సరికొత్త డివైజ్ వారికి ఆటోమేటిక్ గా ఆక్సిజన్ అందించబోతోంది. బాబీ అనే పేరుతో ఆటోమేటెడ్ టాక్టైల్ స్టిమ్యులేషన్ పరికరం రూపొందించబడింది.
ఇది ఒక ఆటోమేటెడ్ శ్వాస సహాయ పరికరం. శిశువు ఛాతీ చుట్టూ ఒక మృదువైన సిలికాన్ బెల్ట్ కట్టబడుతుంది. ఆ బెల్ట్‌లో రెండు చిన్న గాలితో నిండే భాగాలు ఉంటాయి.శిశువు ఊపిరి ఆగినప్పుడు లేదా మానిటర్ లో అలారం వచ్చినప్పుడు, ఈ భాగాలు వాటంతట అవే కదిలి శిశువును సున్నితంగా కదుపుతాయి. దీని ఫలితంగా శిశువు మళ్లీ ఊపిరి తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ పరికరం నర్సింగ్ సిబ్బందిపై భారం తగ్గిస్తుంది తక్షణ సహాయం అందిస్తుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం వేలాది ప్రీటర్మ్ శిశువులు పుడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో నీయోనేటల్ కేర్ సదుపాయాలు పరిమితంగా ఉండటంతో, ఇలాంటి పరికరాలు ఎంతో అవసరం. బాబీ లాంటి తక్కువ ఖర్చుతో, ఆటోమేటెడ్ పరికరాలు మన ఆసుపత్రుల్లో ప్రవేశిస్తే, శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఈ పరికరం పరీక్షా దశలో ఉంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే సాధారణ ఉపయోగంలోకి వస్తుంది. ఇది నర్సుల స్థానంలో పనిచేయదు. కానీ వారికి సహాయక పరికరంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో కూడా విస్తరించగలిగితే, చిన్న పిల్లల ప్రాణాలను కాపాడే దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అవుతుంది.

