కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కారులో బయలుదేరారు. ఎమ్మెల్యే కారు షాద్ నగర్ సమీపంలోని టోల్ గేట్ వద్దకు రాగానే అతివేగంగా వచ్చిన మరో వాహనం ఎమ్మెల్యే కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీహరి వాహనం ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, కార్యకర్తలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్రీహరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో వెంటనే ఆయనను మరో వెహికిల్ లో మహబూబ్ నగర్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

