పాక్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదం రక్తపాతానికి దారి తీసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘన్ సరిహద్దులో ట్యాంక్ జిల్లాలో జరిగిన భారీ బాంబు పేలుడులో ఆరుగురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో స్థానిక పోలీసు చీఫ్ ఇషాక్ అహ్మద్ కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విధుల్లో ఉన్న పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగినట్లు సమాచారం. ఈ దాడిని పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని భద్రతా కారణాల దృష్ట్యా మరిన్ని వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించలేదు. అయితే పాకిస్తాన్ తాలిబన్‌గా పిలవబడే తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల టీటీపీ భద్రతా సిబ్బంది, పౌరులపై దాడులను మరింత పెంచింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉగ్రసంస్థ బలపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్‌పై దాడులకు ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతిస్తోందని పాక్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

