రెండేళ్ల బాలుడిని మింగిన నీటి ఏనుగు
ఉగాండాలో ఓ ఘటన సంచలనంగా మారింది. ఓ నీటి ఏనుగు రెండేళ్ళ బాలుడ్ని మింగిసేంది. అదృష్టవశాత్తు తిరిగి ఆ బాలుడు నీటి ఏనుగు నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను యూకే టెలిగ్రాఫ్ అనే మీడియా సంస్థ వెల్లడించింది. పాల్ ఇగా అనే బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అతడి ఇల్లు కట్వే ప్రాంతంలోని ఎడ్వర్డ్ సరస్సుకు 800 మీటర్ల దూరంలో ఉంది. ఉన్నట్టుండి నీటి నుంచి బయటకు వచ్చిన నీటి ఏనుగు బాలుడ్ని నోట్లో పట్టుకుని మింగేసింది. అక్కడే సమీపంలో ఉన్న ఓ వ్యక్తి చూశాడు. వెంటనే రాళ్లు తీసుకుని నీటి ఏనుగుపై విసరాడు. దీంతో అది మింగేసిన బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. ఇదంతా నిమిషం వ్యవధిలోపే జరిగిపోవడంతో, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.