పెళ్లి కంటే ఘనంగా విడాకులు జరిపించిన తండ్రి
కుమార్తెకు ఘనంగా పెళ్లి జరిపించే తండ్రులను చూసాం. కానీ విడాకులను కూడా ఘనంగా జరిపించిన అరుదైన తండ్రి రాంచీలో ఉండే ప్రేమ్ గుప్తా. అత్తగారింట్లో తన కుమార్తె పడుతున్న కష్టాలకు, వేధింపులకు చలించి పోయిన ప్రేమ్ గుప్తా. ఆమెను ఈ బంధనం నుండి విముక్తురాలిని చేయాలనుకున్నారు. అంతే.. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి తన కుమార్తె సాక్షి గుప్తాను పుట్టింటికి తీసుకొచ్చారు. గత ఏడాది సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో వివాహం కాగా, వివాహం జరిగిన అనంతరం కొద్ది రోజులకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. పైగా అతనికి అంతకు ముందే రెండు సార్లు వివాహం అయినట్లు కూడా తెలిసింది. దీనితో సాక్షి ఇక భరించలేక విడాకులు తీసుకోవాలని భావించగా, సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా చాలా సంతోషించారు. కుమార్తెలు చాలా విలువైన వారని తెలియజెప్పడానికే ఈ రకంగా ఏర్పాట్లు చేసి ఆమెను ఘనంగా తీసుకువచ్చారు. అత్తింట్లో ఆమెకు ఇబ్బందులు, కష్టాలు ఎదురైతే పుట్టింటి వారు అండగా ఉండాలని, గౌరవంగా తీసుకురావాలని సింబాలిక్‌గా తెలియజేసి, ఆదర్శ తండ్రిగా నిలిచారు ప్రేమ్ గుప్తా. అనంతరం సాక్షికి సచిన్‌తో విడాకులు ఇప్పించాలంటూ కోర్టులో కేస్ వేశారు.