NationalNews Alert

ఆర్మీ ఉద్యోగుల జంట వేర్వేరుగా ఆత్మహత్య

భారత మిలటరీకి చెందిన ఒక భార్యాభర్తల జంట వేర్వేరు నగరాలలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన కలకలం సృష్టించింది. ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దీన్ దయాళ్ దీప్ ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పని చేస్తున్నారు. ఆగ్రాలోనే సైనిక ఆసుపత్రిలో అతడి భార్య తన్వర్ కూడా ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తన్వర్, ఆగ్రాలో దీప్  ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి డిన్నర్ ముగించుకున్నాక దీప్ మరుసటి రోజు బయటకు రాలేదని, సహోద్యోగులు తలుపులు పగలగొట్టి చూడగా దీప్ ఉరి వేసుకుని మృతి చెంది కనిపించారు. అదేరోజు తన్వర్ కూడా డిల్లీ కంటోన్మెంట్‌లోని అధికారుల మెస్ హాల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పక్కన సూసైడ్ నోట్ లభ్యమయినట్లు సమాచారం. ఈ నోట్‌లో ఆమె తన భర్త మృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.