Andhra PradeshHome Page Slider

లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటిపై కేసు నమోదు

లక్కీ డ్రా టికెట్లు భారీ ఎత్తున విక్రయించిన వ్యవహారంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు పై పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వైయస్సార్ సంక్రాంతి ముగ్గుల పోటీల సందర్భంగా రాష్ట్రంలో నిషేధించిన లక్కీ డ్రా టికెట్లు విక్రయించడం తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. దీనిపై గుంటూరు జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు బుధవారం ఆయన పై కేసు నమోదు చేశారు. ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా చిట్స్ లాటరీ నిర్వహించరాదు. ఏపీలో లాటరీలపై ఎప్పటినుంచో నిషేధం ఉంది. ఈ చట్టం కింద అంబటి రాంబాబు పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతికి ముందు కనీసం నెల రోజులు సత్తెనపల్లిలో రాంబాబు నాయకత్వంలో వైసీపీ కార్యకర్తలు సంక్రాంతి లక్కీ డ్రా పేరీట భారీ ఎత్తున టికెట్లు విక్రయించారు. ఒక టికెట్ ధర 100 చొప్పున భారీ ఎత్తున విక్రయించడంతో దీనిపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించడంతో గుంటూరు జిల్లా కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలని పోలీసులును ఆదేశించింది. కాగా ఈ వ్యవహారం పై వివాదం కొనసాగుతుండగానే ఈ నెల 12వ తేదీన సత్తెనపల్లిలో అంబటి సమక్షంలో లక్కీ డ్రా తీశారు. గుంటూరుకు చెందిన వినోద్ కుమార్ కు 16 లక్షల విలువైన నక్లెస్ గెలుచుకున్నారు.