భగవద్గీతపై ప్రమాణం చేసిన అమెరికా ఎఫ్‌బీఐ డైరక్టర్
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) డైరక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనతో శుక్రవారం వైట్‌హౌస్‌లో ప్రమాణస్వీకారం చేయించారు అటార్నీ జనరల్ పామ్ బోండీ. ఈ కార్యక్రమంలో కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి, ప్రమాణస్వీకారం చేయడం భారతీయుల మనసు చూరగొంది. కాష్ పటేల్ కుటుంబమూలాలు గుజరాత్లో ఉన్నాయి. అయితే చాలా కాలం క్రితమే అతని పూర్వికులు వలస వెళ్లారు. అతని తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అనంతరం న్యూయార్క్ వచ్చారు. కాష్ పటేల్ న్యూయార్క్‌లోనే జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ చేసి, లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. గతంలో ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేశారు. ఆ సమయంలోనే 2016 ఎన్నికల సమయంలో ట్రంప్ దృష్టిలో పడ్డారు. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక, తన పాలనావర్గంలో పలువురు భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు.

