‘నా మీద పగతోనే ఆ ప్రాజెక్టును పక్కన పడేశారు’..రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నారాయణపేటలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుందని, రాష్ట్రానికి ఏ మాత్రం మేలు చేయలేదని విమర్శించారు. గతంలో తనపై పగతోనే కేసీఆర్ మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేశారని విమర్శలు చేశారు. అప్పటి ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదన్నారు. గత పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి చర్చకు వస్తే తాను సిద్ధంగా ఉన్నానని, గత పదేళ్ల పాలనపై చర్చలు చేద్దాం అని సవాల్ చేశారు. గత పదేళ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదన్నారు.