తునిలో ఉద్రిక్తత
కాకినాడ జిల్లా తుని నగరంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడ జరగనున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నిక కోసం టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. దీనితో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఈ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. 17 మంది వైసీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ వారే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వాదిస్తోంది. టీడీపీ వారే వారిని ఎన్నికకు హాజరు కానివ్వడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనితో నాలుగోసారి కూడా ఎన్నిక వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అక్కడికి చేరుకుని వారికి సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ‘చలో తుని’కి పిలుపునిచ్చారు. దీనితో సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరించారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయి.