ఉత్తరాదిని వణికించిన భూకంపం..ప్రధాని హెచ్చరికలు
సోమవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీతో సహా భూకంపం ఉత్తరాదిని వణికించింది. ఢిల్లీలో భూకంపం సంభవించిన కొద్ది సేపటికే బీహార్లోని సివాన్లో కూడా భూమి కంపించింది. హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రామ్, రోహ్తక్, సోనిపట్లలో కూడా భూమి కంపించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న బహదూర్గఢ్లో కూడా బలమైన ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0 గా నమోదయ్యింది. భూ ప్రకంపనలతో పాటు పెద్ద శబ్దాలు రావడంతో జనం మరింత భయపడ్డారు. ఈ భూకంప కేంద్రం ఢిల్లీ చుట్టూ ఉందని సమాచారం. ఈ భూకంప తీవ్రతపై ప్రధాని మోదీ ప్రజలను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని పేర్కొన్నారు.