మహిళను కాటేసి చనిపోయిన పాము
సహజంగా పాము కాటేస్తే మనుషులు చనిపోవడం చూస్తుంటాం.. పరిపాటిగా జరుగుతుంటుంది. కానీ మనిషిని కాటేసి పాము మృతి చెందిన అరుదైన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాశంగా మారింది. విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం లింగంపేటకు చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో భోజనం చేసింది. అనంతరం కొద్దిసేపటికి సత్యవతి బహిర్భూమి కోసం ఇంటికి సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లారు. అలా వెళ్లిన కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా ఓ పాము సత్యవతిని కాటేసింది. దీంతో భయపడ్డ సత్యవతి పెద్ద పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగు పరుగున ఆమె వద్దకు వెళ్లారు. పాము కాటేసిన విషయం వారికి తెలియజేయడంతో హుటాహుటిన ఎల్ కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం ఎస్ కోట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యం అందించడంతో సత్యవతికి ప్రాణాపాయం తప్పింది.అయితే రాత్రి సమయంలో పాము కాటు వేసిన ప్రాంతానికి మరుసటి రోజు ఉదయం భర్త సన్యాసయ్యతో కలిసి మరికొందరు స్థానికులు వెళ్లి పరిశీలించారు. అలా వెళ్లిన వారు ఆ ప్రాంతాన్ని చూసి కంగుతిన్నారు. సత్యవతిని కాటేసిన పాము అక్కడే మృతి చెంది కనిపించింది. దీంతో అవాక్కైన సత్యవతి భర్త పాము మృతి చెందిన విషయాన్ని వైద్యులకు తెలియజేశాడు. బహుశా ఆ పాము అప్పటికే అనారోగ్యంతో ఉండి ఉంటుందని, కాటేసిన కంగారులో సత్యవతి పామును తొక్కడం వల్ల ఏమైనా పాము చనిపోయి ఉండవచ్చని లేదా కాటేసిన పాము, చనిపోయిన పాము వేరువేరు కూడా అయ్యుండొచ్చని వైద్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం సత్యవతిని కరవడం వల్లే పాము మరణించిందని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ ఆసక్తికర ఘటన జిల్లాలో హాట్ టాపిక్ అయింది.