Home Page SliderNationalNews AlertSports

నీరజ్ చోప్రా వివాహం..భార్య కూడా..

భారత్‌కు జావెలిన్ త్రోలో 2020, 2024లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రా ఒక ఇంటివాడయ్యాడు. రెండు రోజుల క్రితం అతని వివాహం జరిగింది. ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు నీరజ్. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించానంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే విశేషం ఏమంటే అతని భార్య హిమాని మోర్ కూడా అథ్లెటే. ఆమె టెన్నిస్ క్రీడాకారిణి. 2017లో చైనీస్ తైపీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ఆడింది. 2018లో సింగిల్స్‌లో 42వ ర్యాంక్, డబుల్స్‌లో 27వ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.

హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా ఒలింపిక్స్ పథకాలు మాత్రమే కాక 2023, 2024లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజత పతకాలు సాధించారు. 2016లో వరల్డ్ అండర్ 20 ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ అనంతరం భారత్‌కు తిరిగివచ్చే క్రమంలో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మనుబాకర్‌తో, ఆమె తల్లితో నీరజ్ చోప్రా మాట్లాడడంతో మనుబాకర్‌ను పెళ్లి చేసుకుంటాడంటూ పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.